కాఫీవిత్…ఆర్. రమాదేవి. 2720
ఈ ముగింపులేని కథ నిజమేనని గుర్తు కోసం కాస్త గిల్లి వెళ్ళకూడదూ”!!
రమాదేవి భావనాత్మక కవిత్వం ఇది.. రమాదేవి ప్రతీ కవితలో సోల్మేట్ కనిపిస్తాడు. అతగాడు…
వున్నాడా? అంటే వున్నిడు.. లేడంటే లేడు.. కానీ ఈ కవయిత్రి రమాదేవి మానసంలో అతగాడెప్పు
డూ చిరంజీవే..ఈరోజు కాఫీటైమ్లో అతగాడి గురించి రమాదేవి చెప్పే ముచ్చట్ల విందాం..!!
“నువ్వు ఎప్పుడెదురుపడ్డావో
మాటెప్పుడు కలిపావో
అంతగా గుర్తులేదు కాని
నిన్ను చూశాక
అనేక ఇష్టాలు కలిపితే నువ్వని
సత్య ప్రమాణకంగా నమ్మకం కుదిరింది
అంతేనా
చికాకు పరిచే చింతలేమి లేవు
ఆరడి పెట్టే ఆలోచనలు అసలే లేవు
ఇంకా చెప్పాలంటే
నువ్వు వదిలి వెళతావని
నేను మిగిలిపోతానని
కించిత్తు అనుమానము లేదు
ఓయ్
అసలు యే రేయి
ఇంతటి నమ్మకాన్ని పంచిపోయిందో
ఈ ముగింపులేని కథ
నిజమేనని
గుర్తుకోసం కాస్త గిల్లి వెళ్ళకూడదూ”
*R. రమాదేవి..!!
రమాదేవి అక్షరాలకు ప్రేమ పూత పూస్తారు.వాటిని
చదవగానే హృదయానికి తడి తగులుతుంది..మనం
కోల్పోయిన ప్రేమ మనముందుకొచ్చి నిలుచుంటుంది.
కరచాలనం చేస్తుంది.ఏ కవిత్వానికైనా ఇంతకంటే
కావల్సిందేముంటుంది?
ఈ మధ్య కొంతమంది ఈ ప్రేమ కవిత్వాన్ని చూసి
పెదవి విరుస్తున్నారు.. ఇంకా భావకవిత్వం, ప్రేమ కవిత్వమేనా?
వాటికి కాలం చెల్లిపోయి చాలా కాలం అయిందికదా! అన్నది వారి మాట.
మనిషి భావుకుడు.. భావుకత్వం లేకుంటే వాడసలు మనిషే కాడు.
హృదయం వున్నవారికి మాత్రమే ప్రేమ తడి తెలుస్తుంది..
ప్రేమ తడివున్నవారిలోనే భావుకత వైఫైలాగా చుట్టుకొనివుంటుంది..
పచ్చిగాలి పీల్చలేనివారికి, హృదయతడి తెలియని వారికి భావుకత
గురించి ఎంత చెప్పినా అర్ధంకాదు.
అందుకే అలాంటి వారిమాటల్ని పక్కన బెట్టి ఈరోజు రమాదేవి గారి..
ప్రేమ కవిత్వాన్ని ఆస్వాదిద్దాం.!!
అతడు.. ప్లస్ ఆమె. ఈజ్ ఈక్వల్ టు ప్రేమ..
ఇదే ప్రేమ సిద్ధాంతం.ప్రేమలో వెరపే కాదు….
మరపూ సహజమే..సుమా..!
అతగాడెప్పుడు ఎప్పుడెదురుపడ్డాడో.. మాటెప్పుడు కలిపాడో
ఆమెకు అంతగా గుర్తులేదు కానీ..అతడ్ని చూశాకే..
అనేక ఇష్టాలు కలిపితే అతగాడని
సత్య ప్రమాణకంగా ఆమెకు నమ్మకం కుదిరిందట.
అంతేనా..?
అతగాడ్ని కలిశాక…చికాకు పరిచే చింతలేమి లేవు.
ఆరడి పెట్టే ఆలోచనలు అసలే లేవట. ఇంకా చెప్పాలంటే…
అతగాడు తనని వదిలి వెళతాడని, తాను..
ఒంటరిగా మిగిలిపోతానన్న చింత, అనుమానం కించిత్తు కూడా లేనేలేదట.
ఏమిటీ అతగాడిపై ఆమెకింత నమ్మకం అనుకుంటున్నారుకదా.. అదే ప్రేమంటే..
ఓ సారి ప్రేమించాక, ఇష్టపడ్డాక నమ్మకం శిఖరమవుతుంది.
అసలు యే ‘రేయి’ ఇంతటి నమ్మకాన్ని పంచిపోయిందో?
ఈ ముగింపులేని కథ నిజమేనని.. గుర్తుకోసం
ఓయ్..!
కాస్త గిల్లి వెళ్ళకూడదూ”.. అంటోందామె…
అతగాడిపై నమ్మకాన్ని ధృవీకరించుకోడానికి.!!
ప్రేమలో మైమరిచి వున్నోళ్ళకు ఈ గిల్లుళ్ళు,
గిచ్చుళ్ళు వాస్తవ స్థితిని తెలియజేస్తాయి….
మైమరపులోంచి మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చిపడేస్తాయి..
పీకల్లోతు ప్రేమించినవారికి మాత్రమే నండోయ్.! ఈ అనుభవం..!!
*ఎ. రజాహుస్సేన్..!!